నాటి రాజకీయ ప్రముఖులు - నేటి రాజకీయ ప్రముఖులు - నైతిక విలువలు

                             నాటి రాజకీయ ప్రముఖులు -   నేటి రాజకీయ ప్రముఖులు 

                                                           నైతిక విలువలు

                                                                                                             
                                                                                                                                         డా. బి.విశ్వనాథాచారి 

                                                                                            
      ప్రపంచములో ఏ దేశ మైనా  అభివృద్ధి మరియు సుస్థిరతను సాధించాలంటే ఆ దేశ రాజకీయ ప్రముఖుల జీవితాలు నైతిక విలువలు కలిగి ఉండాలి. ప్రజలను ఆ దిశగా ప్రేరేపించేవిగా ఉండాలి. ఆ నాడు అబ్రహం లింకన్, గాంధీ లాంటి వారు వారి దేశ ప్రజలనే గాక ప్రపంచదేశ  ప్రజలందరిని కూడా ప్రభావితులను చేశారు. ప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేసేవారే నిజమైన రాజకీయ నాయకులు. మన దేశంలో ఆ కొవలో ప్రప్రధముడు మన జాతిపిత మహాత్మాగాంధీ. దక్షిణాప్రికాలో 21 సంవత్సరాలు అహింసా మార్గంలో అనేక ప్రజా పోరాటాలలో విజయం సాధించి, భారతదేశం వచ్చిన గాంధీకి అఖండ స్వాగతం లభించింది. ఇంగ్లండులో బారిష్టర్ చదివిన గాంధీ అత్యధిక ఆదాయము కలిగిన న్యాయవాద వృత్తిని వదలి దేశస్వాతంత్ర్య పోరాటంలో  ప్రముఖపాత్ర వహించి, సత్యము, అహింస అనే సందేశాన్ని ప్రపంచానికి అందించారు. అలాగే అత్యంత ధనవంతులైన మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ తమ సంపదనంతా దేశం కొరకు త్యాగం చేసి, స్వాతంత్ర్యపోరాటంలోపాల్గొన్నారు. అలాగే ఆ రోజుల్లో గొప్ప లాయర్ గా పేరుపొందిన చిత్తరంజన్ దాస్ తన వృత్తిని, విలాసవంతమైన జీవితాన్ని వదలి ఖాది ధరించి, స్వాతంత్ర్యపోరాటంలోపాల్గొని ప్రజలకు ఎనలేని  సేవ చేశారు. వీరు దేశబందు చిత్తరంజన్ దాస్ గా ప్రసిద్ది గాంచారు.  ఉక్కు మనిషిగా పేరుపొందిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ బారిష్టర్ పట్టానుపొందిన తరువాత, బార్డోలిసత్యాగ్రహములో నాయకత్వం వహించి దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు. స్వాతంత్ర్యము వచ్చిన తరువాత దేశ ఉప ప్రధానిగా, హోం మంత్రిగా పనిచేశారు. భారత దేశంలో ౩౦౦ లకు పైగా ఉన్న సంస్ధానాలను భారత ప్రభుత్వంలో విలీనం చేయటంలో ఆయన పాత్ర చాలా ప్రశంసనీయమైనది. పటేల్ ఆ నాటి ప్రధానియైన నెహ్రుతో కూడ విభేదించి దేశ శ్రేయస్సుకొరకు తాను నమ్మిన ప్రణాళికలను అమలు చేశారు. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్నిగుజరాత్ లో  అక్టోబర్ 31న ఆవిష్కరించారు. . ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహానికి  స్టాట్యూ ఆఫ్ యూనిటీ గా  నామకరణం చేశారు.  నెహ్రూ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పని చేసిన లాల్ బహదూర్ శాస్త్రి ఒక పెద్ద రైలు ప్రమాదము సంభవించినప్పుడు దానికి భాద్యత వహిస్తూ,  తన మంత్రి పదవికి రాజీనామాచేశారు. ఆ సమయములో తన కార్యాలయములో ఉన్న ఆయన తన కారు తాళాలు అప్పగించి, నడిచి ఇంటికి వచ్చేశారు. అంతటి నిరాడంబరులు, నిజాయితీ పరులు ఆ నాటి రాజకీయ నాయకులు. తరువాత కాలంలో ప్రధాని యైన లాల్ బహదూర్ శాస్త్రి భారత - పాకిస్తాన్ యుద్దంలో పై చేయి సాధించి అందరి మన్ననలను పొందారు. జై జవాన్- జై కిసాన్  అనే నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించారు. దురదృష్ట వశాత్తు తాష్కెంట్ సంధి సందర్భంగా ఆయన రష్యాలో మరణించారు. ఆయన అన్నిఉన్నత పదవులు నిర్వహించినప్పటికి మరణించేనాటికి ఆర్ధికంగా బలహీనంగానే ఉన్నారు. మన రాజ్యాంగ రచనాసంఘం లో 7 గురు సభ్యులు ఉన్నప్పటికి ఆ పనిలో పూర్తిగా నిమగ్నమయి,పూర్తి చేసింది డా. అంబేత్కర్ ఒక్కరే. ఆయన తన జీవితమంతా దళితుల అభ్యున్నతికై నిస్వార్ధంగా పోరాడారు. కేంద్రమంత్రి వర్గంలో న్యాయశాఖా మంత్రిగా ఉన్న డా. అంబేత్కర్ 1951 లో  స్వచ్చందంగా తృణప్రాయంగా తన పదవికి రాజీనామా చేశారు. ఈనాడు మంత్రి పదవుల కొరకు పార్టీలను, సిద్దాంతాలను విడిచిపెట్టే నాయకులను ఎంతో మందిని చూస్తున్నాం. ఆంధ్రదేశంలో టంగుటూరి ప్రకాశం గారి పేరు తెలియని వారు ఉండరు. ఆయన బాల్యంలో వారాలుచేసుకుంటూ విద్యాభ్యాసం చేశారు. తరువాత కాలంలో మద్రాసులో న్యాయవాదశాస్త్రం చదివారు. రాజమండ్రిలో న్యాయవాదవృత్తిలో రాణిస్తూ, రాజమండ్రి  పురపాలక సంఘానికి అధ్యక్షులయ్యారు. లండన్ లో బారిష్టరు చదివు పూర్తిచేసి, మద్రాను హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించిన తొలి తెలుగు న్యాయవాది టంగుటూరి ప్రకాశం.  ఆయన 1921 లో స్వాతంత్ర్యపోరాటంలోపాల్గొనే నాటికే లాయర్ గా లక్షలాది రూపాయలు సంపాదించారు. సైమన్ కమీషన్ వచ్చినప్పుడు మద్రానులో బిటీషు సైనికులు తుపాకీలు గురిపెట్టినప్పుడు ఆయన తన చాతీని తుపాకీలకు ఎదురుగా పెట్టి, కాల్చమన్నధీశాలి టంగుటూరి. అప్పటి నుండి ఆయన ఆంద్రకేసరి గా ప్రసిద్ధికెక్కారు.ఆయన రాజాజీ మంత్రివర్గంలో రెవన్యూమంత్రిగ, మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశారు.  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1953 అక్టోబర్‌ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితులయ్యారు.. ప్రకాశం తన ఆస్తినంతా ప్రజాసేవలోనే  ఖర్చు పెట్టారు. 1957 లో ప్రకాశం  మరణించే నాటికి ఆయనకు చెప్పుకోదగ్గ ఆస్తి ఏమీ లేదు. అలాగే 2౩ సంవత్సరాలు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబసు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో  ఎమ్.ఎల్.ఎ. గా  సేవలు అందించిస పుచ్చలపల్లిసుందరయ్య గారు తమ ఆస్తులను, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి ప్రజాసేవయే తమ జీవిత పరమావధిగా పనిచేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.  అటువంటి ఆనాటి రాజకీయనాయకులతో పోల్చతగిన నాయకులు ఈనాడు చాలా అరుదుగా కనిపిస్తారు.  ఈనాడు అనేకమంది నేరపూరిత చరిత్రలు కలిగిన రాజకీయనాయకుల జీవితాలు ప్రసారమాధ్యమాల ద్వారా తెలిసినప్పుడు ప్రజలకు రాజకీయాలపట్ల ఏహ్యభావం కలుగుతుంది.  మరల ఆనాటినాయకుల వంటివారు రావాలనిప్రజలు  ఎదురు చూస్తున్నారు.  
       దేశమంతటా జరిగే  ఎన్నికలలో వేల, లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఓట్లను కొని, ప్రభుత్వాలను ఏర్పాటుచేసే   రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అవినీతిరహిత పాలనను ఎలా అందిస్తారనేది ఒక గొప్ప చిదంబర రహస్యం.  దీనికి కాలమే బదులు చెప్పాలి.


Comments